కన్న కూతురినే కాటేసిన కామాంధుడు. బెదిరించి మూడేళ్లుగా అత్యాచారం.***విషమంగా విప్లవ నటుడు మాదాల రంగారావు అరోగ్యం .***కాంగ్రెస్‌ పార్టీకి 20 ,జేడీఎస్‌కు 13 మంత్రులు***2019లో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటుచేస్తాం .***ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి***కాంగ్రెస్, జేడీఎస్‌లో మంత్రి పదవుల కోసం పాట్లు***నేడే సీఎంగా ప్రమాణం !***విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా***ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ..??***కనిపించకుండా పోయిన MLA లు దొరికారు .

బ్లూవేల్‌ ఎందుకొస్తుందంటే…

బ్లూవేల్‌ ఛాలెంజ్‌.. ప్రపంచాన్ని వణికిస్తోంది ఇప్పుడు!! తక్షణం దీన్ని కట్టడిచేయాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. మొన్ననే సీబీఎస్‌ఈ కూడా స్కూళ్లకి కొన్ని మార్గదర్శకాలు పంపించింది. దాన్ని కట్టడి చేయడంతోపాటూ.. మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అంశం ఒకటుంది. అసలీ ఛాలెంజ్‌ ఎవర్ని లక్ష్యంగా చేసుకుంటోందీ అని! ఎవర్ని? కుంగుబాటుని ఎదుర్కొంటున్న టీనేజీ పిల్లల్ని!! ప్రపంచవ్యాప్తంగా నమోదైన 130 పైచిలుకు మరణాలు చెబుతున్న నిజం ఇది. ఓ రకంగా బ్లూవేల్‌ మనం ఈ కుంగుబాటుపై మరింత దృష్టిపెట్టాలని చెబుతోంది. తల్లిదండ్రులూ, పిల్లల మధ్య దూరం పెరిగిపోతోందని మరోసారి హెచ్చరిస్తోంది!! ఆ దూరాన్ని తగ్గించడమెలాగో చూద్దామా?
ఇదివరకెన్నడూ లేనివిధంగా.. గత రెండు దశాబ్దాలుగా మనదేశంలోని టీనేజర్స్‌లో ఆత్మహత్యలు పెరిగాయి. కొన్ని స్థాయిభేదాలతో కుంగుబాటూ ఎక్కువ మందిలో కనిపిస్తోంది. దీనికి కారణమేంటీ? మనదేశం చారిత్రకంగా ఎన్నో యుద్ధాలు ఎదుర్కొంది. తీవ్ర ఆర్థికమాంద్యాలూ, కరవులూ చవిచూసింది. కానీ ఎప్పుడూ కూడా టీనేజీవాళ్లు కుంగుబాటుకి గురై.. ఆత్మహత్యల దాకా వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. అలా వెళ్లకపోవడానికి కారణం.. మన బలమైన కుటుంబ వ్యవస్థే. తల్లో తండ్రో, అన్నో, అక్కో, అమ్మమ్మో, నాన్నమ్మో ఇరవైఏళ్ల దాకా కూడా వాళ్లని లాలనగా చూడటమే. ఇందువల్ల మన టీనేజర్‌లకి ‘నేను బతకడమే వ్యర్థం..!’ అనే భావన వచ్చేది కాదు. అలాంటి ఓ ఆదరణా, దన్నూ, తోడు లేని ఒంటరితనం నేటి టీనేజర్లలో పెరిగింది. దీనికి రెండు కారణాలు. ఒకటి.. నేటితరం చదువులూ, దానిపై తల్లిదండ్రుల్లో ఉన్న ఓ వేలం వెర్రి! ఇంకొకటి.. పిల్లలతో కనీసం మాట్లాడే ఓపికా, తీరికా వాళ్లకి లేకపోవడం. యువతరం తల్లిదండ్రులు పిల్లలకు వస్తుపరంగా అన్నీ సమకూరుస్తున్నారు. కానీ ‘నీకోసమే మేమున్నాం. నువ్వంటే మాకు ప్రాణం!’ అని మాటల్లో, చేతల్లో చూపలేకపోతున్నారు. అది మనం చేయగలిగితే టీనేజీ కుంగుబాటుని 90 శాతం దాకా పరిహరించొచ్చు.
అదెలా చేయాలి?
* ప్రతి ఒక్కరూ ప్రత్యేకమే : ఓ అడవిలో జంతువులన్నింటికీ చెట్లెక్కే పోటీపెట్టారని అనుకుందాం. ఏనుగు ఎన్నో స్థానంలో నిలుస్తుంది? చివరి స్థానం కూడా రాదు కదా! ఆ కారణంతో ఏనుగుకి శక్తిలేదని అంటామా? పిల్లల విషయంలో అదే చేస్తున్నాం. ప్రతి చిన్నారీ ఎందులో సమర్థులో తెలుసుకోలేక ర్యాంకులు తెచ్చుకోవాలని చూస్తున్నాం. వెనకపడితే పనికిరావని ముద్రవేసి కించపరుస్తున్నాం. అలాకాకుండా టీనేజీ వచ్చేలోపే వాళ్లు ఎందులో సమర్థులో గ్రహించండి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి. ఆ రంగంలో ప్రోత్సహించండి.
* బలహీనతలు సహా.. : ‘ఇట్స్‌ ఓకే టుబీ నాట్‌ ఓకే!’ అని చెబుతుంటారు ఆంగ్లంలో. పిల్లల్లో లోపాలున్నప్పుడు మనస్ఫూర్తిగా అంగీకరించండి. వాటిని పదేపదే ఎత్తిచూపకండి. ‘మనలో లోపాలు ఉన్నంత మాత్రాన.. అమ్మానాన్న నన్ను దూరం చేయరు!’ అనే చిన్న నమ్మకాన్ని వాళ్లకివ్వండి.
* అక్కున చేర్చుకోండి : స్కిన్‌ హంగర్‌.. అమ్మానాన్నా తమని అక్కున చేర్చుకోవాలనే తపన. చిన్నారులకే కాదు టీనేజీవాళ్లకీ ఇది ఉంటుంది. మరీ కృతకంగా అనిపించినా సరే.. రోజుకొక్కసారైనా ఇలా దగ్గరకు తీసుకోండి. ఏదైనా మంచిపని చేసినప్పుడు భుజం తట్టండి. ఇది చాలావరకూ పిల్లల్లో ఒంటరి భావన రాకుండా చూస్తుంది.
* సమయం ముఖ్యం : మీకెన్ని పనులున్నా సరే కనీసం రోజుకి గంటైనా పిల్లలతో గడిపేలా చూడండి. ఆ సమయంలో అందరూ కలిసి ఏదైనా సృజనలో నిమగ్నంకండి. ఆ గంటపాటూ పూర్తిగా మీ స్మార్ట్‌ఫోన్‌లూ.. అంతర్జాలానికి దూరంగా ఉండండి. కనీసం వారానికోసారి, ఒక్కపూటైనా అందరూ కలిసి ‘గాడ్జెట్‌ ఫ్రీ డే’ని పాటించండి. వీలైతే బయటకు వెళ్లిరండి. ఏడాదికొక్కసారైనా మీరున్న పరిస్థితులకి భిన్నమైన వాతావరణంలో గడపండి. ఇదంతా కుటుంబ సభ్యులమధ్య బంధాన్ని పెంచుతుంది.
* అన్యోన్యంగా మీరు : పిల్లల మనో వ్యాకులతకి ప్రధాన కారణం.. తల్లిదండ్రుల మధ్య అన్యోన్యత లేకపోవడమే! అమ్మానాన్నా విడిపోతారనే భయం ఐదేళ్లప్పటి నుంచే వాళ్లలో వచ్చేస్తుంది. ఇద్దరూ ఎప్పుడూ గొడవపడుతూ ఉంటే.. విడిపోయే పరిస్థితులుంటే బయటకు చెప్పుకోలేక కుంగిపోతారు. వ్యసనానికి బానిసయ్యేవాళ్లూ, తమని తాము హింసించుకునేవారు, ప్రేమపేరుతో మోసాలు చేసేవాళ్లేకాదు, ఆ వంచనకు సులభంగా గురయ్యేవారి నేపథ్యంలోనూ ఈ సమస్య ఉంటోంది!
* పనులు నేర్పించండి : ఓవైపు పిల్లలకి కావాల్సిన లాలన ఇవ్వలేని మనం వాళ్లని అతి సున్నితంగా పెంచుతున్నాం. ప్రతిదీ మనమే చేసిపెడుతున్నాం! అలాకాకుండా ఇంటిపనీ, వంటపనీ, నెలవారీ బిల్లులు కట్టడం ఇలా అన్నీ నేర్పించండి. ముఖ్యంగా, ఇల్లు వూడ్చడం నుంచి బాత్రూమ్‌ క్లీనింగ్‌ ద్వాకా ప్రతి పనీ గౌరవమైనదేననే విషయం టీనేజీలోనే వాళ్లకి మనం నేర్పించగలగాలి!! జపాన్‌, ఆస్ట్రేలియాలో ఈ పద్ధతే పాటిస్తుంటారు. ఈ జీవన నైపుణ్యాలు వారిలో ఆత్మవిశ్వాసం నింపుతాయి. ప్రపంచాన్ని ఎదుర్కోవడం నేర్పుతాయి.
* చుట్టూ సానుకూలత : ప్రతిరోజూ వాళ్లకి జరిగిన ఓ మంచిని రాయమనండి. వాళ్లతోపాటూ మీరూ రాయండి. ఇందుకో డైరీ పెట్టండి. ‘గ్రాటిట్యూడ్‌’ డైరీ అంటారు దీన్ని. మన ఇంట్లో సానుకూలత పెంచే మంచి టానిక్‌ ఇది!
బ్లూవేల్‌ లక్షణాలివి..
* ఒంటరితనం : ఒకప్పుడు నచ్చని హారర్‌, హింసాత్మక సినిమాలు చూడటం, ఏకాంతం కోసం తపించడం, తీవ్రమైన ఒంటరితనం.. చూస్తుండగానే జీవచ్ఛవంలా మారడం ఇవన్నీ కేవలం రెండునెలల తేడాలోనే కనిపిస్తాయి.
* తెచ్చిపెట్టుకున్న ఉత్సాహం : ‘మావాడు నిన్నటిదాకా ఆనందంగానే కనిపించాడు. జోకులేశాడు. కానీ..’ అని వాపోయింది బ్లూవేల్‌ ఛాలెంజ్‌తో మరణించిన ఓ కుర్రాడివాళ్లమ్మ! ఇది ‘హై ఫంక్షనింగ్‌’ డిప్రెషన్‌ లక్షణం. ఇలాంటివాళ్లు ఎక్కడలేని ఉత్సాహాన్ని కనబరుస్తారు.
* స్లీవ్స్‌ వేయడం : నిద్రాహారాలూ తగ్గించడంతోపాటూ అప్పటిదాకా స్లీవ్స్‌, షర్టులంటే గిట్టనివాళ్లు వాటినే ఎక్కువ వాడుతుంటారు. ఇది ఒంటిపై వాళ్లకి వాళ్లు చేసుకునే గాయాలు దాచుకోవడానికి అన్నమాట. ఓ కన్నేసి ఉంచండి.
* అప్పగింతలు : ‘నేను చనిపోతే నువ్వు తట్టుకోగలవా?’ ఇలాంటివి ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఏదోనవ్వి వూరుకోకుండా మాట్లాడి.. అవసరమైతే మానసిక నిపుణుల దగ్గరకి తీసుకెళ్లండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *